న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొబైల్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆయన ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్న అర్హులైన వృద్ధులు, వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సిబ్బందే సదరు ఓటరు ఇంటికి వెళ్లి ఓటు వేయించుకుంటారు.
పోలింగ్‌కు ముందే ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియు పూర్తిచేస్తారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ జిల్లాలోని ఎన్నికల కార్యాలయం కూడా జిల్లాలో ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యాన్ని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉపయోగించుకున్నారు. మొబైల్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన సోమవారం ఉదయం ఓటు వేశారు. అన్సారీ ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలను న్యూఢిల్లీ జిల్లా ఎన్నికల కార్యాలయం విడుదల చేసింది.
ఇక, వచ్చే నెల (ఫిబ్రవరి) 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హవా కొనసాగింది. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. బీజేపీకి 2015లో మూడు, 2020లో 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి.