ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతోమంది భారతీయ యువతీ యువకులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటుంటారు. అమెరికా వెళ్లేందుకు అనేక వ్యయప్రయాసలు పడుతుంటారు. కొందరైతే అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి గెంటివేయబడుతున్నారు.
భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తించిన క్రిస్టెన్ ఫిషర్
ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండగా, అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పిల్లలు భారత్‌లోనే పెరగాలని కోరుకోవడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తేలా కీర్తించడం విశేషం. తన పిల్లలను భారత్‌లో ఎందుకు చదివించాలని భావిస్తుందో వివరిస్తూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో నివాసం
స్కైఫిష్ డెవలప్‌మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉంటోంది. తన పిల్లలు భారతదేశంలో పెరిగితే ప్రయోజకులు అవుతారంటూ ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లో గడిస్తే ఎందుకు మంచిగా ఉంటుందో కూడా ఆమె వివరించింది.
బలమైన సన్నిహిత సంబంధాలు వుంటాయి
భారత్‌లో నివసిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారని, దానివల్ల సామాజిక నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు సానుభూతిగా వ్యవహరించడం తెలుస్తుందన్నారు. అలానే భారతీయ కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయని, తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుందని, ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుందన్నారు. ఈ వాతావరణంలో పెరిగితే అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మంచి కేరీర్‌కు
పరిస్థితులకు అనుగుణంగా జీవించడం, సర్దుకుపోవడం వంటివి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు ఇక్కడ స్నేహితులు అవుతారని, ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కేరీర్‌కు దోహదపడతాయన్నారు.