ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోనిఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్‌లో జరిగిన మాస్ కాపీయింగ్ ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు చూసిరాతకు ఉపాధ్యాయులే సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఐఐటి (ట్రిపుల్ ఐటీ) సీట్ల కోసం విద్యార్థులకు నేరుగా మార్గదర్శనం చేస్తూ, ప్రశ్నల సమాధానాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
డిఈఓ ఫిర్యాదు
మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి రావడానికి ఓ విద్యార్థి ఫిర్యాదు కారణమైంది. విద్యార్థి డిఈఓ కృష్ణ చైతన్యకు ఫోన్ చేసి తాను మెరిట్ స్టూడెంట్‌నని తనకు ఐఐఐటీ లో సీటు సంపాదించాలన్న ఆశయం ఉందని కానీ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కావున తనకు ఐఐఐటి సీటు వస్తాదా రాదా అన్న అనుమానం కలుగుతుందని చెప్పాడట. సదరు విద్యార్థి ఫిర్యాదుకి స్పందించిన డిఈఓ రెండు రోజుల పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జిల్లాలోని అదే మండలంలో ఐఐఐటి ఉంది. ఇక్కడ పదోతరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు దక్కుతాయి. దాంతో ఐఐఐటి లో సీట్లు పొందేందుకు ఉపాధ్యాయుల సహకారంతో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
డీబార్
డిఈఓ ఆధ్వర్యంలో నాలుగు టీమ్ లు కుప్పిలి గ్రామoలో రైడ్ చేశాయి. మోడల్ స్కూల్ లో రెండు పరీక్ష కేంద్రాలతో పాటు స్థానిక ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపైన దాడి చేయగా మొత్తం వ్యవహారం బయట పడింది. మోడల్ స్కూల్ ఏ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు, బి పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.

రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం ఐదుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్థానిక జేడ్ పి ఉన్నత పాఠశాలలోనూ ఇంగ్లీష్ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఉపాధ్యాయులే లిఖించి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులను డిబార్ చేయటంతో పాటు 14మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.