బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన వయస్సు 87 ఏళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.హిందీ సినీ పరిశ్రమలో ఆయన అద్భుతమైన రచయిత, దర్శకుడు, నటుడిగా తనదైన ముద్ర వేశారు.మనోజ్ కుమార్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ‘పూరబ్ ఔర్ పాచిమ్’, ‘క్రాంతి’, ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ వంటి సినిమాలు ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.
భరత్ కుమార్
దేశ భక్తి చిత్రాలకి ఆయన బాగా ఫేమస్.దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో ఆయనను ‘భరత్ కుమార్’ అని పిలుచుకునేవారు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, పాటల రచయితగా, ఎడిటర్‌గా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే, 2015లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్నారు.ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.జూలై 24, 1937న జన్మించారు మనోజ్ కుమార్. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. మనోజ్ కుమార్ సినీరంగంలో ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తిదాయకం. “షహీద్” (1965), “ఉప్కార్” (1967), “పురబ్ ఔర్ పశ్చిమ్” (1970) , “రోటీ కప్దా ఔర్ మకాన్” (1974) వంటి అనేక దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించారు.“ఉప్కార్” చిత్రంలో అతను పోషించిన పాత్రకి గాను ఆయనని అందరు భరత్ కుమార్ అని కూడా పిలుస్తుంటారు. “హరియాలీ ఔర్ రాస్తా”, “వో కౌన్ థీ”, “హిమాలయా కి గాడ్ మే”, “దో బదన్”, “పత్తర్ కే సనమ్”, “నీల్ కమల్”, “క్రాంతి” వంటి ఫేమస్ చిత్రాలలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించాడు.
ప్రధాని మోదీ సంతాపం
మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. మనోజ్ మరణవార్త తననెంతో బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ఐకాన్. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన రచనల్లోనూ జాతీయభావం ఉప్పొంగుతుంటుంది. అవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఎక్స్ వేదికగా తెలిపారు.