ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. 16మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇరువర్గాల మధ్య కాల్పులు
స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. శనివారం ఉదయం కూడా సెర్చ్ ఆపరేషన్ కొసాగుతుండగా కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాదిలోనే జరిగిన మూడో భారీ ఆపరేషన్
2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాతే ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సలిజం ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రభుత్వ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో దాదాపు 100మందికిపైగా నక్సల్స్ మరణించారు. ఇక తాజాగా ఎన్కౌంటర్ ఈ ఏడాదిలోనే జరిగిన మూడో భారీ ఆపరేషన్. మార్చిన 20న బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 30 మంది మావోయిస్టులు హతమయ్యారు.