హైదరాబాద్: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,245 ఓట్లు వచ్చాయి. దీంతో 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 63,871 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 9వ రౌండ్‌లో 6,921 ఓట్లు సాధించారు. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 59,831 ఓట్లు పోలయ్యాయి.

ఇప్పటివరకు 1,89,000 ఓట్ల లెక్కింపు
ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,040 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000కాగా.. ఇప్పటివరకు 1,89,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆ రోజంతా చెల్లని ఓట్లను విభజించి కట్టలు కట్టడానికే సరిపోయింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోల్ కాగా.. వాటిలో 28,000 ఓట్లు చెల్లుబాటు కానివిగా నిర్ధారించారు.
ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ
మిగిలిన 2,24,100 ఓట్లను ఒక్కో రౌండ్‌లో 21,000 చొప్పున లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఆరు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 45,401 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 38,470 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 31,481 ఓట్లు వచ్చాయి. కాగా, మరికొందరు ఇతరులు, స్వతంత్రులు స్వల్ప ఓట్లతోనే కొనసాగుతున్నారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ కొనసాగుతుండడంతో మొదటి ప్రాఽధాన్య ఓట్లలో ఎవరూ కోటా ఓట్లను సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.