తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి దశలో అత్యంత పేదవారికే ఈ ఇళ్లను కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత ఉండాలని, అర్హులకే అవకాశం కల్పించాలన్నది సీఎం దృష్టి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు, నిరుపేదలకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
“ఇందిరమ్మ కమిటీలు” కచ్చితంగా, నిబద్ధతతో పనిచేయాలి
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాటైన “ఇందిరమ్మ కమిటీలు” కచ్చితంగా, నిబద్ధతతో పనిచేయాలని సీఎం సూచించారు. అర్హులను గుర్తించడంలో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిటీలు గ్రామ స్థాయిలో సర్వే చేసి, నిజంగా ఇల్లు అవసరమైన వారిని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని సబ్సిడీ ధరకే
అలాగే, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని సబ్సిడీ ధరకే అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్ధవంతంగా అమలవుతుందని, లక్షలాది పేద కుటుంబాలకు ఇది బాసటగా నిలుస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.