Central Govt : భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని శుక్రవారం సూచించింది. ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారానికి సంబంధించినవని, వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది. విదేశీ పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం ఆశిస్తాం.

ట్రంప్ హెచ్చరికలు
అదేవిధంగా భారతీయ పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు వారు కూడా అక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాలి అని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. ఇటీవల కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీలను ఉద్దేశంచి ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీ, స్కూల్ లేదా యూనివర్సిటీలకు అన్ని ఫెడరల్ నిధులు నిలిపివేస్తా. ఆందోళనకారులను జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుంది. అమెరికా విద్యార్థులైతే శాశ్వత బహిష్కరణ లేదా కేసు తీవ్రతను బట్టి అరెస్టు ఉంటుంది. ఇందులో ఎటువంటి దాపరికం లేదు అని పేర్కొన్నారు.
హమాస్‌కు మద్దతుగా ప్రచారం
కాగా, వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ఖాన్ సురి విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి వీసాను రద్దు చేయడమే కాక..గత సోమవారం వర్జీనియాలోని నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత అతడికి తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అతడి బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.