కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎదుర్కొంటోన్న నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వీళ్లద్దరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌లో పెట్టింది. 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మళ్లించడానికి ప్రధాన సూత్రధారులుగా పేర్కొంది.
ఇది- కాంగ్రెస్ పార్టీ అవినీతి, అధికార దుర్వినియోగం, వంశపారంపర్య పాలనకు నిదర్శనమని భారతీయ జనత పార్టీ ఆరోపిస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఈ కేసుకు బీజం పడిందని, దీని మూలాలు 1950 నాటివి అంటూ ఆ పార్టీ విమర్శిస్తోంది. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేశారని తెలిపింది.
నేషనల్ హెరాల్డ్‌ను నిధుల సేకరణ కోసం..
సర్దార్ పటేల్స్ కరస్పాండెన్స్ పుస్తకంలో నమోదైన మే 1950 నాటి లేఖల్లో- నేషనల్ హెరాల్డ్‌ను నిధుల సేకరణ కోసం ఉపయోగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి నిధులు సేకరించడంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద లేదా అక్రమ మార్గాల ద్వారా వచ్చే నిధులను అంగీకరించవద్దని సూచించారు. ఈ విషయంలో నెహ్రూ దాటవేత ధోరణిని అనుసరించారు. దీనిపై తనకు అవగాహన లేదని, దర్యాప్తు చేయిస్తానంటూ చెప్పడం వల్లభ్ భాయ్ పటేల్ అనుమానాలను మరింత బలపరిచింది. ఆర్థిక అవకతవకలు, అవినీతిపై పటేల్ చేసిన హెచ్చరికలను నెహ్రూ పెడచెవిన పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యానికి, అహంకారానికి, అవినీతిమయ సంప్రదాయానికి దారితీసిందని విమర్శకులు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత- అప్పట్లో పటేల్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని బీజేపీ నాయకులు అంటున్నారు.
చట్టపరమైన లొసుగులను
చట్టపరమైన లొసుగులను ఉపయోగించి మూతపడిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధీనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ రహస్యంగా స్వాధీనం చేసుకుందని ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇది ఆర్థికపరమైన పొరపాటు కాదని, వ్యక్తిగత లాభం కోసం రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపిస్తోంది. 1950న హిమాలయన్ ఎయిర్‌వేస్ నుండి నేషనల్ హెరాల్డ్‌కు 75,000 రూపాయల విరాళం అందింది. దీనిపై నెహ్రూకు లేఖ రాశారు వల్లభ్ భాయ్ పటేల్. భారత వైమానిక దళం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ- ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పొందిందీ సంస్థ అప్పట్లో. విరాళం ఇచ్చిన వారిలో ఒకరైన అఖాని.. బ్యాంక్‌ను మోసం చేసిన కేసును ఎదుర్కొంటోన్నారంటూ పటేల్ హెచ్చరించారు.
అక్రమ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు
అప్పట్లో నెహ్రూ ఇచ్చిన ఈ సమాధానం నిర్లక్ష్యంతో కూడుకుని ఉన్నదని, అక్రమ లావాదేవీలు, ఆర్థిక అవకతవకల తీవ్రతను తగ్గించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పుడే నెహ్రూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని ఉంటే నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగివుండేది కాదని అంటున్నారు. నెహ్రూ రాసిన లేఖకు పటేల్ ఆ మరుసటి రోజే అంటే- మే 6వ తేదీన మరో ప్రత్యుత్తరం రాశారు. కొన్ని విరాళాలు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినవని, వాటిలో ఎలాంటి స్వార్థం లేదంటూ నెహ్రూ చేసిన వాదనను తిప్పికొట్టారు.
బీజేపీ చేస్తోన్న విమర్శలు ఏమిటి?
ఇప్పుడు తాజాగా ఈ కేసును బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి తవ్వి తీశారు. గాంధీ కుటుంబం ప్రభుత్వ ఆస్తులను స్వాహా చేయడానికి వ్యవస్థాగత కుట్ర పన్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన వాదనలు సైతం బీజేపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలకు దగ్గరగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సంస్థలా పనిచేసిందని, రాజకీయ పలుకుబడిని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుందనేది బీజేపీ ఆరోపణ.
Read Also: Stalin : మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం స్టాలిన్