AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లి ప్రత్యేకంగా చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనా వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కేబినెట్ సమావేశంలో టీచర్ల బదిలీల నియంత్రణ కోసం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే, రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని, మర మగ్గాల కోసం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించాలని నిర్ణయించారు.నంబూరులోని వీవీఐటీయూ విద్యాసంస్థకు ప్రైవేట్ యూనివర్శిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అంతేకాకుండా అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కొన్ని సంస్థలకు భూకేటాయింపులపై కూడా ఈ సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు.ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.
నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని కమిషన్ సూచించగా, కొందరు ఎమ్మెల్యేలు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలన్న ప్రతిపాదన చేశారు.దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని నిర్ణయించగా, 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లాను యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని తేల్చారు. దీనికి అనుగుణంగా, అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు.అంతేకాకుండా, బుడగజంగాలు సహా మరో కులాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. వైఎస్సార్ జిల్లాను ఇకపై ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పిలవాలని నిర్ణయం తీసుకుంది. పెనమలూరులోని తాడిగడప మున్సిపాలిటీకి ‘వైఎస్సార్’ పేరు తొలగించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చలు మొదలయ్యాయి.