Rapthadu Brave Girl Lakshmi: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో జరిగిన ఘటనలో తన స్నేహితురాలిని కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన బాలిక లక్ష్మికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాడికి పాల్పడిన హేమంత్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతోంది. లక్ష్మి చూపిన సాహసానికి గుర్తింపుగా ఆమె పేరును జాతీయ సాహస బాలిక అవార్డుకు ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే, లక్ష్మి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. అవార్డుతో పాటు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
Read Also :YS Jagan Case: పోలింగ్ రోజు ధర్నా ఎఫెక్ట్.. జగన్, అవినాష్ రెడ్డిపై కేసు నమోదు!
కూలి పనులతో కుటుంబ పోషణ.. ఆర్థిక ఇబ్బందులు
లక్ష్మి తల్లి రమాదేవి ఓ ప్రైవేట్ కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు. లక్ష్మి పెద్ద కుమార్తె కాగా, రెండో కుమార్తె యామిని ఎనిమిదో తరగతి, మూడో కుమార్తె వర్షిణి ఆరో తరగతి, కుమారుడు వినోద్ నాలుగో తరగతి చదువుతున్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కుటుంబంలో మరో చిన్నారి వర్షిణి వైకల్యంతో బాధపడుతోంది. ఆమెకు అవసరమైన వైద్యం అందించేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నాగరాజు తల్లి, లక్ష్మి నానమ్మ అంజినమ్మ కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు వైద్యం, మందుల ఖర్చులు భరించడం కూడా కుటుంబానికి భారంగా మారిందని ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
శిథిలావస్థలో ఇళ్లు.. సాయం చేయాలని విజ్ఞప్తి
లక్ష్మి కుటుంబానికి గతంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఆ తర్వాత మరో ఇల్లు కూడా మంజూరైనప్పటికీ, రెండు ఇళ్లూ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. లక్ష్మికి సాహస అవార్డు రావడం సంతోషకరమే అయినప్పటికీ, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, వైద్య సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా వైకల్యంతో బాధపడుతున్న ఆమె సోదరికి అవసరమైన వైద్య సాయం, పింఛన్ వంటి సహాయం అందించాలని కోరుతున్నారు.
Rapthadu Brave Girl Lakshmi: లక్ష్మి ధైర్యంపై నారా లోకేష్ ప్రశంసలు
రాప్తాడు ఘటనలో లక్ష్మి చూపిన ధైర్యసాహసాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్నేహితురాలిని కాపాడేందుకు దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన లక్ష్మిని ఆయన అభినందించారు. భయపడి పారిపోకుండా స్నేహితురాలికి అండగా నిలిచి, తీవ్రంగా గాయపడినా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. లక్ష్మికి అత్యుత్తమ వైద్యం అందిస్తామని, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. జాతీయ సాహస బాలిక అవార్డుకు లక్ష్మి పేరు సిఫారసు కావడంతో పాటు, ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :