ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నా, మూడో విడత జాబితా విడుదలతో నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే 20 కార్పొరేషన్ల ఛైర్మన్లతో తొలి జాబితా, 59 మందితో రెండో జాబితా విడుదలైంది. ఇప్పుడు మూడో విడత లో 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ప్రకటించడంతో 705 నామినేటెడ్ పదవులు భర్తీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు.

నామినేటెడ్ పదవుల కోసం పార్టీ నేతల పోటీ
నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ నుంచి దాదాపు 60,000 దరఖాస్తులు వచ్చాయి. కూటమిలోని జనసేన, బీజేపీ నుంచి కూడా చాలా మంది ఈ పదవుల కోసం ఆశిస్తున్నారు. అందుకే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత పెంచేలా ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు నేతలు చెబుతున్నారు. తాజా జాబితాలో స్థానాల కేటాయింపు ఇలా ఉంది. 37 – టీడీపీ, 8 – జనసేన, 2 – బీజేపీ అయితే, ఇంకా చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు ప్రక్రియలో ఆలస్యం కావడంతో కొన్ని వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది.
మూడో జాబితాలో నియామకాలు
ఈసారి మూడో జాబితాలో- 47 మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ప్రకటించారు. మిగిలిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండళ్ల నియామకాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ముందుగా ప్రకటించాలనుకున్న 60 మార్కెట్ కమిటీలు, 60 కార్పొరేషన్లు, 21 ఆలయ పాలక మండళ్ల జాబితాను కుదించారు. మొత్తంగా ఈ మూడో జాబితాతో పాటు ఇప్పటివరకు భర్తీ అయిన నామినేటెడ్ పదవుల సంఖ్య 705కి చేరింది. పదవుల కేటాయింపు రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే సీట్లు ఆశించి మిస్ అయిన నేతలు, ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నించిన వారు నామినేటెడ్ పదవుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఉత్కంఠ టీడీపీతో పాటుగా కూటమిలోని మిగిలిన రెండు పార్టీల నుంచి పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో, కసరత్తు విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల పై హామీ పొంది దక్కని వారు సైతం రాష్ట్ర స్థాయి ఛైర్మన్ల రేసులో ఉన్నారు. అందులో జనసేన, బీజేపీ నుంచి పోటీ పెరుగుతోంది. అయితే మూడు పార్టీల నేతలు పోటీ పడుతుండటంతో, సమతుల్యత పాటించడానికి ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. అంతేకాక, నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకే ప్రభుత్వం జాబితాలను విడతల వారీగా విడుదల చేస్తోందని తెలుస్తోంది. మిగిలిన నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో టీడీపీ మేజర్ వాటా దక్కించుకోగా, జనసేన, బీజేపీ నేతలకు తక్కువగా దక్కింది. ఈ నేపథ్యంలో తర్వాతి జాబితాలో ఎక్కువ సంఖ్యలో జనసేన, బీజేపీ నేతలకు అవకాశాలు ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు.