ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన బన్నీ దంపతులు, ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పి, చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అల్లు అర్జున్ పరామర్శించడం ప్రత్యేకం
మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసినప్పటి నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కుటుంబానికి పరామర్శలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబం వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించడం ప్రత్యేకంగా నిలిచింది. బన్నీ మర్యాదపూర్వకంగా పవన్‌ను కలిసిన సమయంలో, ఇద్దరి మధ్య కొద్ది సేపు సన్నిహితంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

ఈ ఘటన నేపథ్యంలో పవన్ కుటుంబానికి సినీ పరిశ్రమతో పాటు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడుతూ ఉందని వైద్యులు తెలియజేయడంతో కుటుంబసభ్యులు కొంత ఊరట పొందుతున్నారు.