హైదరాబాద్‌లో హలీమ్ సీజన్ ప్రారంభమవడంతో వంట నూనెకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కల్తీ గాళ్లు సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నారు. బ్రాండ్ నామాలను అటూఇటుగా మార్చి, నకిలీ లేబుళ్లను అతికించి నాసిరకం నూనెను అసలైన నాణ్యమైన నూనెగా విక్రయిస్తున్న దందా తాజాగా హైదరాబాద్ మలక్‌పేట గంజ్ మార్కెట్ లో వెలుగుచూసింది. ఈ ఘటన టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో బయటపడింది.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్
హైదరాబాద్ మలక్‌పేట ప్రాంతంలో ఉన్న మహబూబ్ మాన్షన్ మార్కెట్ భారీ ఆయిల్ స్కాంలో కీలకంగా మారింది. ప్రముఖ ఆయిల్ కంపెనీల పేరుతో ప్యాకేజింగ్, లేబులింగ్, ప్రమాణాల ధృవీకరణ వంటి అంశాలను వాస్తవంగా పాటించకుండా, కేవలం బూటకపు లేబుళ్లతో నాసిరకం నూనెను విక్రయిస్తున్నారు. పోలీసులు శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీ అనే షాపును తనిఖీ చేయగా, పెద్ద ఎత్తున కల్తీ నూనె నిల్వలు, ఖాళీ అట్టపెట్టెలు, బ్రాండెడ్ కంపెనీల నకిలీ లేబుళ్లు కనిపించాయి.
కల్తీ నూనె
ఈ మాఫియా పద్ధతి చాలా వ్యూహాత్మకం. నాసిరకం నూనెను డ్రమ్‌లలో నిల్వ ఉంచి, దాన్ని ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అటాచ్ఛి 20 లీటర్ల క్యాన్లలో హోటళ్లకు హోటళ్లకు తరలిస్తున్నట్లు తేల్చారు, రెస్టారెంట్లకు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. హలీమ్ సీజన్ కావడంతో ఈ నకిలీ నూనెను లారీల కొద్దీ హైదరాబాద్ వ్యాప్తంగా హోటళ్లకు పంపుతున్నారు.
సంచలన విషయాలు
టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోదాంపై దాడి చేసినప్పుడు బ్రాండెడ్ కంపెనీల పేరు ఉన్న వేలాది లేబుళ్లు, ఖాళీ పెట్రోలు డబ్బాలు, నాసిరకం నూనెతో నిండిన డ్రమ్‌లు కనిపించాయి. దీంతో ఈ దందా ఎప్పటి నుంచీ సాగుతోంది? ఇప్పటివరకు ఎంత మేరకు కల్తీ నూనెను సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్చరిక
కల్తీ నూనె కారణంగా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకు నూనెను విక్రయించే దుకాణాలను నమ్మకూడదని, ఎల్లప్పుడూ అధికారికంగా ధృవీకరించబడిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.హలీమ్ సీజన్‌లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కల్తీ గాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కల్తీ నూనె దందా రోజు రోజుకు విస్తరించిపోతూ ప్రజల ఆరోగ్యానికి భారీ ప్రమాదాన్ని కలిగిస్తోంది. అధిక లాభాల కోసం నాణ్యమైన వంట నూనె పేరుతో నాసిరకం నూనెను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్ళు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ విక్రయదారులు దీని ప్రధాన వినియోగదారులుగా మారుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ లాభాలు పొందేందుకు కల్తీ నూనెను ఖాళీ బ్రాండెడ్ డబ్బాల్లో నింపి విక్రయిస్తున్నారు.