తిరుమల: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 60 మందికి గాయాలయ్యాయి. వారందర్నీ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఐతే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. రుయా ఆస్పత్రికి తరలివచ్చిన రోగుల బంధువుల ఆర్తనాదాలతో.. ఆస్పత్రి వాతావరణం విషాదంగా మారింది. భక్తులు ఒకటి కోరుకుంటే, జరిగింది మరొకటి అయ్యింది.
తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నారు. వారికి తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో టోకెన్లను ఇస్తున్నారు. ఐతే.. శ్రీనివాసం, సత్యనారాయణ పురం, బైరాగిపట్టెడ దగ్గర భక్తులు టోకెన్ల కోసం పోటీ పడటంతో తీవ్ర తోపులాట, తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఆ సమయంలో.. తమిళనాడుకి చెందిన భక్తురాలు మల్లికను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆమె మధ్యలోనే చనిపోయారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ఈసారి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం ఉదయం ఉండగా.. భక్తులు బుధవారం నుంచే టికెట్ల (టోకెన్ల) కోసం పోటీ పడుతున్నారు. టోకెన్లు ఇచ్చే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలలో ఉన్నారు. టికెట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో ఒకేసారి గుంపులుగా రావడంతో.. ఇలా తొక్కిసలాటలు, తోపులాటల ఘటనలు జరిగాయి.
ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఏపీలోని విశాఖకు వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. “తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కొందరు భక్తులు మరణించడం దురదృష్టకరం అని ప్రధాని మోడీ అన్నారు. వారి మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన చంద్రబాబు.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా చాలా మంది నేతలు జరిగిన ఘటనపై సంతాపం తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.