న్యూఢిల్లీ: అస్సాంలోని డిమా హసావోలోని బొగ్గు గనిలో రెండు రోజుల క్రితం ఆ గనిలోకి నీరు ప్రవేశించింది. దీంతో దాంట్లో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. నీటితో నిండిన గనిలోకి 21 పారా డ్రైవర్లు గాలింపు కోసం వెళ్లారు. గని దిగువ భాగం నుంచి ఓ మృతదేహాన్ని తీసుకువచ్చారు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
విశాఖపట్టణంకు చెందిన డైవర్లు అక్కడకు చేరుకున్నారు. ఆపరేషన్‌కు ముందు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత క్వారీలోకి ఎంటరయ్యారు. గని నుంచి నీటిని తొవ్వేందుకు ఎస్డీఆర్ఎఫ్ డీవాటర్ పంపులను తీసుకువస్తోంది. కుంభీగ్రామ్ నుంచి కూడా ఎంఐ17 హెలికాప్టర్ ద్వారా ఓఎన్జీసీ వాటర్ పైపులను తీసుకువస్తున్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో మాట్లాడినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కోల్ ఇండియాకు చెందిన సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్‌కు రానున్నట్లు మంత్రి తెలిపారు. క్వారీలో నీరు వంద ఫీట్లకు చేరుకున్నది.
సుమారు 340 ఫీట్ల లోతులో ఉన్న క్వారీలో కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కార్మికుల పేర్లను కూడా రిలీజ్ చేశారు.అక్రమ రీతిలో గని నిర్వహిస్తున్నట్లు గుర్తించామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఉమ్రాంగ్సో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఎన్డీఆర్ఎఫ్ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ హెచ్పీఎస్ ఖాన్‌దారి మాట్లాడుతూ.. నిన్న చాలాసార్లు కార్మికులను చేరుకునేందుకు ప్రయత్నించామని, కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. జాయింట్ టీమ్ ఇవాళ గనిలోకి డైవ్‌చేసిందని, వాళ్లు ఓ బాడీని రికవరీ చేసినట్లు చెప్పారు. గనుల్లో డైవింగ్ చేయడం సులువైన అంశం కాదని, రాట్ హోల్స్ ఉన్నాయని, వాటి ఆధారంగా గాలింపు ఉంటుందని ఆయన తెలిపారు.