టీటీడీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా.. తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను రుయా ఆస్పత్రి వద్ద రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనాయణ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అవడంతో.. వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసులు తరలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి ముందు ఇలాంటి ఘటన దురదృష్టకరమని మంత్రులు అన్నారు. అలాగే తొక్కిసలాటపై తిరుపతి పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బైరాగిపట్టడి రామానాయుడు స్కూల్ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కోరారు. అలాగే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకోనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు.