హైరదాబాద్: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు 4 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు, అన్ని కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అయితే జనవరి 11న రెండో శనివారం, జనవరి 12న ఆదివారం రావడంతో.. మొత్తంగా విద్యార్థులకు 6 రోజులపాటు సెలువులు వచ్చినట్లయింది. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు తిరిగి జనవరి 17న తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది.
కాగా, తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 16న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 29న నిర్వహించనున్నారు. ఇక జనవరి 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష జనవరి 31న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు.
ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్ ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి. అదేవిధంగా మార్చి 6 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.