దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సంస్థలు.. విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్రోకెమికల్స్ రంగంలోకి అడుగు పెట్టాయి. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన ఇండోరమ రిసోర్సెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
అదాని గ్రూప్‌కు చెందిన అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఈ మేరకు ఇండోరమ రిసోర్సెస్‌తో జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది. ఇండోరమ రిసోర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీ వాలర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో విలీన ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారాన్ని ఇచ్చింది.
ఈ జాయింట్ వెంచర్‌లో అదానీ పెట్రోకెమికల్స్- ఇండోరమ మొత్తం 50 శాతం వాటాలను కలిగి ఉంటాయి. రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ రంగంలో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీర్ఘకాలంలో రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్ యూనిట్లు, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. గుజరాత్‌లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గౌతమ్ అదానీ 2022లోనే వెల్లడించిన విషయం తెలిసిందే.