ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉదంతంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం భవనంపై గుడ్లు, రాళ్లు విసరడం మొదలుపెట్టారు.
ఈ ఘటన హింసాత్మకంగా మారగా, బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. రాళ్ల దాడి జరగగా, బీజేపీకి చెందిన ఒక కార్యకర్త తలకు గాయాలైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.