గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాపై విపరీతమైన బజ్ తీసుకురాగా..తాజాగా చిత్రంలోని మెలోడీ సాంగ్ విడుదలై మరింత ఆసక్తి పెంచింది. చిత్రంలోని ‘అరుగు మీద’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. తమన్, రోషిణి JKV పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. రామ్ చరణ్, అంజలిపై ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జరగండి, రా మచ్చా, నానా హైరానా సాంగ్స్ సూపర్ హిట్ గా నిలవగా.. తాజా మెలోడీ సైతం వాటితో జత కలిసింది. మరి ఈ సాంగ్ వెండితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
ఇక శంకర్ గత చిత్రాల్లో ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ సినిమాలు సామాజిక నేపథ్యం, అవినీతి కథాంశాలుగా తెరకెక్కాయి. తాజాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సైతం అదే తరహాలో రూపుదిద్దుకున్నట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు. శంకర్ తన గత చిత్రాల్లో కథానాయకుడి పాత్రలు ఎంతో భిన్నంగా తీర్చిదిద్దారు. ఒక్కరోజు సీఎం అవకాశమిస్తే రాష్ట్ర భవిష్యత్ మార్చేసిన హీరోను ఒకే ఒక్కడులో చూశాం. తెగిపోయిన బ్రేక్ వైరు పట్టుకుని అపరిచితుడిని మేల్కొల్పి అవినీతి నేతలపై జరిపిన పోరాటాల్నీ తెరపై ఆస్వాదించాం. జెంటిల్మెన్, భారతీయుడు, శివాజీ చిత్రాల్లోనూ అవినీతి నేతలు, అక్రమాలే కథా వస్తువులు.
గేమ్ ఛేంజర్ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ప్రభుత్వ అధికారికి మధ్య జరిగే ఘర్షణగా తెలుస్తోంది. “కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే పెద్దగా దానికొచ్చే నష్టమేమీ లేదు.. కానీ అది లక్ష చీమలకు ఆహారం అనే డైలాగ్ తోపాటు “నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్” అనే మరో డైలాగ్ అవినీతి రాజకీయ నేతపై జరిపే పోరాటాన్ని గుర్తు తెస్తోందంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. మరి వారు అనుకున్నట్లు సినిమా ఉంటుందా..? లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.