రాష్ట్ర BJP అధ్యక్షురాలు పురందీశ్వరి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ఆదుకుంటుందని ఆమె ప్రకటించారు. “కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తొలిసారిగా PM మోదీ విశాఖకు వస్తున్నారు. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు” అని పురందీశ్వరి తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని అందించాలని ఉద్దేశ్యంతో ఉంది. ఈ ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను తిరిగి అభివృద్ధి చేసి, ఆర్థికంగా పటిష్టం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని పురందీశ్వరి పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ వృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకంగా మారతుందని ఆమె చెప్పారు. మోదీ ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పథకాలను తీసుకొస్తున్నారో మనం చూడాలి. ఆయన ప్రత్యేకంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనవిగా మారుతాయి అని తెలిపారు.
మోడీ పర్యటన విషయానికి వస్తే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్టణంలో పర్యటిస్తారు. మొదట రోడ్ షో చేపడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రోడ్ షోలో ప్రధానితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రోడ్ షో, సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ నేతలతో రోడ్ షో, సభ విజయవంతంపై చర్చించారు.
ప్రధాని షెడ్యూల్ చూస్తే …
రేపు విశాఖకు ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి వస్తారు.
సాయంత్రం 4:15 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
సాయంత్రం 4:45 గంటకు విశాఖలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి రోడ్ షో ప్రారంభం
సాయంత్రం 6 గంటలకు బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగం
సాయంత్రం 6.45 గంటలకు ఏపీ నుంచి తిరుగు ప్రయాణం