జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కూడా ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదు చేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

రసాభాసగా మారిన సమావేశం
ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుపడ్డారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ ఒకర్నొకరు తోసుకొని కొట్టుకున్నంత పని చేశారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు సమక్షంలోనే గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ్నుంచి తరలించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.