న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటున్నాయని విమర్శించారు. మేకిన్ ఇండియా పథకం ఉద్దేశం మంచిదేనని, కానీ ఇప్పటిదాకా ఆ పథకంతో ఒరిగిందేమీలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 90 శాతం మంది వెనుకబడినవాళ్లేనని తెలిపారు. దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదని ఎన్డీయే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఉత్పత్తుల పెంపుపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. సాఫ్ట్ వేర్ విప్లవం గేమ్ చేంజర్ లా నిలుస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. చాలా సంస్థలు ఉత్పాదనలు పెంచడానికి ప్రయత్నించాయని, కానీ తయారీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఉత్పత్తులను చైనాకు అప్పగించామని అన్నారు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని అన్నారు. మేకిన్ ఇండియా ఆచరణలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ముందు అకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయని, ఓటర్ల సంఖ్య ఉన్నట్టుండి ఎందుకు పెరుగుతోందో ఈసీ చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ పడిపోయిందని… 2014లో 15.3 శాతం ఉన్న జీడీపీ 12.6 శాతానికి పడిపోయిందని వివరించారు. ఏఐలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందని తెలిపారు.