లక్నో: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో మహా కుంభమేళా పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారని తెలిపారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై సీఎం సభలో స్పందించారు.

దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం
పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు రూ.50వేల నుంచి రూ.52వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. అలా మొత్తంగా 130 పడవలతో రూ.30కోట్లు ఆర్జించారు అని యోగి వివరించారు. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు.
దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం
ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. హోటల్ పరిశ్రమకు రూ.40వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33వేల కోట్లు, రవాణాకు రూ.1.5లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు. ఆర్థికంగా చూస్తే కుంభమేళా నిర్వహణ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5శాతం వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని సీఎం తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే.