దోమలు ప్రతి ఒక్కరిని ఒకేలా దాడి చేయవు. కొన్ని వ్యక్తులను ఎక్కువగా, మరికొందరిని తక్కువగా కుడతాయి. దీని వెనుక కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రక్తపు గ్రూప్ దోమల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధనల ప్రకారం, ‘O’ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులను దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీరి రక్తంలోని ప్రత్యేకమైన రసాయనాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘A’ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులను దోమలు తక్కువగా కుడతాయి.
చెమట, శరీర వాసన ప్రభావం
దోమలు ఆకర్షితమయ్యే మరొక ముఖ్యమైన అంశం శరీరంపై ఉండే చెమట మరియు బ్యాక్టీరియా. మన చర్మంపై సహజంగా కొన్ని రకాల బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటాయి. ఇవి చెమటతో కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన విడుదల చేస్తాయి. ఈ వాసన కొన్ని వ్యక్తులను దోమలకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అందువల్ల, ఎక్కువ చెమట పట్టే వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి.

గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై ఎక్కువ ప్రభావం
దోమలు గర్భిణీ స్త్రీలను కూడా ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. గర్భిణీలు సాధారణంగా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది దోమలను ఆకర్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా, వ్యాయామం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, చెమట ఎక్కువగా విడుదల కావడం వలన కూడా దోమలు వ్యాయామం చేసిన వ్యక్తులను ఎక్కువగా కుడతాయి.
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దోమల కాట్లను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. దోమల నియంత్రణకు ప్రత్యేకమైన స్ప్రేలు, కాయిల్‌లు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి. ముఖ్యంగా రాత్రివేళ దోమల కాట్లకు గురికాకుండా ఉండేందుకు దోమతెరలు వాడడం మంచిది. శరీరాన్ని పూర్తిగా కప్పుకునే బట్టలు ధరించడం, తక్కువ వాసన ఉన్న సబ్బులు, లోషన్లు వాడటం ద్వారా కూడా దోమల ఆకర్షణను తగ్గించుకోవచ్చు.