ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల కలకలం. ఆయన నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం కొత్త వివాదాలకు తెరలేపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టపై దెబ్బ పడిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వర్మ మాత్రం ఆ కరెన్సీ తనది కాదని చెప్పినా, నిజమెంతవరకు అన్న ప్రశ్నలే మిగిలాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సైతం ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తం చేస్తోంది.అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సైతం ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు, సుప్రీంకోర్టు కొలీజియం తన సహచరుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అఖిలపక్ష సమావేశం
కరెన్సీ కట్టల వ్యవహారంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో వాయిదా తీర్మానాలు దాఖలు చేశాయి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్ ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ అధినేతల అభిప్రాయాన్ని తీసుకుని నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. దీంతో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అభిశంసన తీర్మానం
దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేందుకు అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఓటు ద్వారా తొలగించబడతారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వివిధ నిఘా సంస్థలు విచారణ చేపడతాయి. కానీ జడ్జిలపై చర్యలు తీసుకోవడానికి అభిశంసన మాత్రమే ఏకైక మార్గం.ఈ ప్రక్రియకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (సుప్రీంకోర్టు జడ్జిల కోసం), ఆర్టికల్ 218 (హైకోర్టు జడ్జిల కోసం) ఆధారంగా నడిపించాలి.

జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్
అలాగే, 1968 నాటి “జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్” ప్రకారం,లోక్‌సభలో 100 మంది ఎంపీలు లేదా రాజ్యసభలో 50 మంది ఎంపీలు అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలి.లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ ఈ నోటీసును స్వీకరిస్తే, ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు.ఈ కమిటీ విచారణ నిర్వహించి, ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తే, పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు.ఈ తీర్మానం స్పెషల్ మెజారిటీ తో ఆమోదించాలి. అంటే, సభలోని మొత్తం సభ్యుల సగం కంటే ఎక్కువ మంది, హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల కంటే తక్కువ కాకుండా ఉండాలి.లోక్‌సభలో ఆమోదమైన తీర్మానం రాజ్యసభలో కూడా అదే మెజారిటీతో ఆమోదం పొందాలి.చివరగా, ఈ తీర్మానం రాష్ట్రపతికి పంపి, ఆయన ఉత్తర్వుల ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలి.
న్యాయవ్యవస్థ
సమాజంలో తప్పు చేసినవారికి న్యాయమూర్తులు శిక్ష విధిస్తారు. కానీ, అదే న్యాయమూర్తే తప్పు చేస్తే? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.