Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉంది. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటైంది. ఈ కమిషన్ తన నివేదికను కేంద్రానికి అప్పగించింది.తాజాగా ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం” అనే అంశంపై కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ సమావేశానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జమిలి ఎన్నికల ప్రాధాన్యత, గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, “1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ఆ తర్వాత 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగేవి” అని తెలిపారు. కానీ, ఆ తర్వాత ఇందిరా గాంధీ హయాంలో ఎన్నికల ప్రక్రియలో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు.వెంకయ్యనాయుడు “ఇందిరా గాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో మార్పులు వచ్చాయి” అని తెలిపారు. దీంతో జమిలి ఎన్నికల విధానం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.”గతంలో జమిలి ఎన్నికలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. కానీ, ఇప్పుడు అదే పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందేంటి?” అంటూ వెంకయ్యనాయుడు కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నించారు. ఎన్నికల ఖర్చులను తగ్గించేందుకు, దేశ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఒకే దేశం – ఒకే ఎన్నిక పద్ధతి అవసరం అని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
ఒకేసారి ఎన్నికలు జరిగితే, పాలనాపరమైన స్థిరత పెరుగుతుందని, భారీగా ఖర్చులు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనికి అనేక సవాళ్లు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే అధ్యక్ష పదవీ కాలం, అసెంబ్లీ రద్దు, రాజ్యాంగ మార్పులు వంటి కీలక విషయాలను కేంద్రం సప్తించాల్సి ఉంటుంది.ఒకే దేశం – ఒకే ఎన్నికపై ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం, న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. కోవింద్ కమిషన్ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.