Vallabaneni Vamsi: ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు : కోర్టు ఆదేశాలు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఆయనను మంగళవారం గన్నవరం పోలీసులు మరో కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. అనంతరం గన్నవరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, రిమాండ్ అభ్యర్థన పెట్టారు. విచారణ అనంతరం ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

భూ వివాదం కేసులో మరో అరెస్టు
ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భూ రిజిస్ట్రేషన్ వివాదానికి సంబంధించిన కేసులో వల్లభనేని వంశీపై మునుపటే కేసు నమోదు అయింది.కోర్టు అనుమతితో పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయన్ను అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
జైలులో సౌకర్యాల కోసం వంశీ అభ్యర్థన
వంశీ తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జైలు అధికారులకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇవ్వాలని కోర్టును కోరారు.”జైలులో నాకు ఇనుప మంచం ఇచ్చారు. పరుపు, ఫైబర్ కుర్చీ ఏర్పాటుకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి” అని న్యాయమూర్తిని అభ్యర్థించారు.
అయితే, ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్నందున, తాము ఆదేశాలు ఇవ్వలేమని గన్నవరం కోర్టు స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు సమర్పిస్తే, ఆధారంగా ఫైబర్ కుర్చీ ఏర్పాటు విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది.
వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ
విచారణ అనంతరం పోలీసులు వంశీని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న వంశీకి ఈ తాజా అరెస్టుతో మరింత సమస్యలు పెరిగినట్టే. ఆయనపై మరిన్ని కేసులు ఉండే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.