వాస్తుశాస్త్రం
వాస్తు అంటే ఇండ్లు మొదలైన నివాస యోగ్యమైన కట్టడాలు నిర్మించుకోదగిన భూమి అని అర్థం. అటువంటి భూమిని గురించి చెప్పేది ‘వాస్తుశాస్త్రం‘. అయితే శాస్త్రం కేవలం ఇండ్లకు మాత్రమే పరిమితం కాకుండా గుళ్లకు, పంటభూములకు, గ్రామాలకు, పట్టణాలకు, దేశాలకు, ఖండాలకు సైతం అన్వయించబడటం, యథాతథ ఫలితాలు కలుగజేయడం ‘శాస్త్రం’ అంటే నియమ గ్రంథమని అర్థం. ఇవి ఆరు: (1) తర్కం (2) వ్యాకరణం (3) ధర్మం (4) మీమాంస (5) వైద్యం (6) జ్యోతిషం. ఈ ఆరు వాస్తుకు అన్వయించబడే విధానం:

తర్కం
ఏదయితే మన పంచేంద్రియాల్లో ఒకదానికి సుస్పష్టంగా గోచరిస్తుందో దాని గురించి తర్కంతో పనిలేదు. ఉదాహరణకు ‘నీళ్ల’ నెవరికయినా చూపిస్తే అవి ‘నీళ్లు’ అని ప్రతిఒక్కరూ చెప్తారు. అక్కడ రెండవ అభిప్రాయానికి తావు లేదు. మనిషికి పూర్తిగా తెలియని విషయం గురించి కూడా తర్కించుకునే అవకాశం లేదు. కొంత తెలిసీ, మరికొంత తెలియనప్పుడే భిన్నాభిప్రాయాలు ఏర్పడి ‘తర్కించడం’ ప్రారంభిస్తాడు. ‘వాస్తు’ గురించి ప్రతిఒక్కరికీ ఎంతో కొంత తెలుసు. ‘వాస్తు’ను నమ్మకపోవడం కూడా భిన్నాభిప్రాయాలను లేవదీస్తుంది. అందుకే పది మందిలో ‘వాస్తు’ ప్రస్తావన వచ్చినప్పడు ‘తర్కం’ మొదలవుతుంది.
వ్యాకరణం
అష్టదిశలు, వాటి ఎత్తుపల్లాలే ‘వాస్తు వ్యాకరణం‘. అక్షరాలను ఎలా రాస్తే పదాలు అలా తయారవుతాయి. ‘గాడ్’ అని రాయవచ్చు. అవే అక్షరాలను ‘డాగ్’ అని కూడా రాయవచ్చు. అక్షరాలు అవే అయినా పదం అర్థం మారిపోయినట్లు, దిక్కులు అవే అయినా వాటి ఎత్తుపల్లాలను బట్టి వాటి ఫలితాలు మారిపోతాయి. ఇంట్లో నీరు తూర్పు, ఈశాన్య, ఉత్తర పల్లం వైపు ప్రయాణిస్తే ‘ఆ ఇల్లు తల్లిలా చూసుకుంటుంది. అలాకాక పడమర, దక్షిణాలకు పల్లమయితే, తిరగేసి రాసిన తప్పు పదంలా, తల్లి లాంటి ఇల్లు కూడా పిలిస్తే పలకదు.
ధర్మం
‘వాస్తు’లో ప్రతి దిక్కుకూ ఒక ధర్మముంది. ఆ ధర్మాన్ని దిక్కులు నిర్వహిస్తాయి. అందుకు ఆ భూమి లేదా ఇంటి యజమాని/యజమానురాలి సహకారం కూడా ఉండాలి. ఒక దిశగానీ కొన్ని దిశలుగానీ దోషపూరితమయినవిగా ఉన్నప్పుడు ఇంటి యజమాని దాన్ని కనుగొని సవరించినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు.
“ఒక వస్తువును శూన్యంలో విసిరేసినట్లయితే దాని మీద ఇతర శక్తుల ప్రభావం లేనంతవరకు అది శూన్యంలో అదే వేగంతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది” అన్న విషయాన్ని సైన్సు ఒప్పుకుంది. అలాగే ఒక ఇంట్లో ఉన్న దోషాన్ని సవరించనంత కాలం ఆ దోష ప్రభావం ఎంతకాలమైనా అలాగే ఉండిపోయి ఆ ఇంట్లోవాళ్లు బాధలకు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తు ధర్మం.
మీమాంస
అంటే ‘కర్మ బ్రహ్మ ప్రతిపాదన’ శాస్త్రమని అర్థం. బ్రహ్మచేత లిఖించబడిన నుదుటిరాతగానీ, బ్రహ్మదేవుడుగానీ అగోచరం కాబట్టి వీటిని నమ్మనివాళ్లు ఉండవచ్చు. కానీ ఇల్లు కట్టిన తీరును బట్టి సత్ఫలితాలుగానీ, దుష్ఫలితాలుగానీ కళ్లముందే కనిపించడం అనుభవజ్ఞులకు తెలుసు.
వైద్యం
రోగికి వైద్యం చేస్తే ఆరోగ్యం అంటే ఏమిటి? బాగవుతుంది. అలాగే దోషపూరితమైన గృహాలను వాస్తు పరంగా సరిచేస్తే ఆ దోషాలు పోయి ఇల్లు సుభిక్షమవుతుంది. నివాస యోగ్యమవుతుంది. ఒక్కోసారి రోగికి ‘ఆపరేషన్’ అవసరమయినట్టే తీవ్రమైన దోషాలను సవరించలేని గృహాలకు కూడా ‘ఆపరేషన్’ అవసరమవుతూ ఉంటుంది.
జ్యోతిషం
చేతిలోని గీతలను బట్టి జరిగింది, జరగబోయేది ఎలా చేస్తారో అలాగే ఇంట్లో దిశలను బట్టి ఫలాఫలాలు చెప్పవచ్చు. అయితే చేతిలో గీతలను అనుకూలంగా మార్చడం సాధ్యంకాదు. కానీ ఇంట్లో దిశలను అనుకూలంగా మార్చుకోవడం మన చేతుల్లో ఉంది.