ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి అస్సాంలోని కామాఖ్య వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ కటక్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాల తప్పగా, ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. అనేక మంది గాయపడినట్లు తెలుస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రమాదం ఎలా జరిగింది?
కటక్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అనుకోని సమస్య తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. రైలు వేగంగా ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో అల్లకల్లోలం అయ్యారు. రాత్రివేళ జరిగిన ఈ ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

గాయపడినవారికి చికిత్స.. సహాయక చర్యలు
ప్రమాదం తర్వాత వెంటనే రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, మిగతా ప్రయాణికుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ ప్రమాదంతో ట్రాక్‌పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరించేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరో రైలు ద్వారా ప్రయాణాన్ని కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.