Toxic gas : మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి చెందారు. ఖాండ్వా జిల్లాలో జిల్లాలోని చైగావ్ మఖాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మఖాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడటానికి మరో ఏడుగురు బావిలోకి దిగారు.

విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని
అయితే వారంతా ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. బావి నుంచి వెలువడే విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతులను రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35), మోహన్ పటేల్ (53) గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా
ఇక, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ తీవ్ర విషాదం నేపథ్యంలో గ్రామస్తులు… భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బావిని మూసివేయాలని నిర్ణయించారు.