బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బండి సంజయ్‌కు నిజంగా దమ్ముంటే, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలన్నారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం సహకారం అవసరం అని గుర్తు చేస్తూ, ఢిల్లీ పెద్దల వద్ద బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
బీజేపీ – బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఉందా?
మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించిన కీలక విషయం బీజేపీ – బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది అనే అంశం. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకే బీజేపీ బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం చేసుకుందన్న ఆరోపణలు చేసారు. ప్రజల్లో విరక్తి వస్తున్న వేళ, బీజేపీ నాయకులు వాస్తవాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శ
బండి సంజయ్ పార్టీపై పట్టుకోలేని స్థితిలో ఉన్నారని, ఆయన వైఖరిపై బీజేపీ లోని సొంత నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీలో అంతర్గత అసమ్మతి పెరుగుతున్నదని, నాయకత్వంపై విశ్వాసం తగ్గిపోతుందని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేకుండా, రాజకీయ లాభాల కోసమే సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు.
కేంద్ర మంత్రి స్థాయికి తగిన ప్రవర్తన ఎక్కడ?
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన పదవికి తగిన బాధ్యతతో మాట్లాడాల్సిందిగా మహేష్ గౌడ్ సూచించారు. పదవిని మరచిపోయి దిగజారి మాట్లాడుతున్నారని, ఇది ఒక మంత్రికి తగదు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఢిల్లీ ముందు వినిపించడంలో విఫలమైన నేతగా బండి సంజయ్ కొనసాగుతున్నారని ఘాటుగా విమర్శించారు.