జేబీ కెమికల్స్ (JB Chemicals) అండ్ ఫార్మాస్యూటికల్స్‌లో మెజారిటీ వాటాను రూ.19,500 కోట్లకు స్వాధీనం చేసుకుంటున్నట్లు టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ (Torrent Pharma) ప్రకటించింది. ఈ లావాదేవీ అనంతరం దేశీయంగా రెండో అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఫార్మా కంపెనీగా టొరెంట్ ఫార్మా అవతరించనుంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం..
ఇండియా ఫార్మా రంగంలో చరిత్రాత్మక డీల్
ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జేబీ కెమికల్స్‌లో 46.39% వాటాను, ప్రమోటర్ అయిన తావ్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ (అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేఆర్‌లో భాగం) నుంచి అహ్మదాబాద్(Ahmedabad)కు చెందిన టొరెంట్ ఫార్మా రూ.11,917 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఆ సంస్థ ఉద్యోగుల నుంచి మరో 2.80% వాటాను రూ.719 కోట్లకు (షేరు రూ.1,600 చొప్పున) స్వాధీనం చేసుకుంటుంది. తదుపరి మరో 26% వాటా కోసం ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. ప్రస్తుత షేరు ధర రూ.1799.35 కాగా, అంతకంటే తక్కువగా షేరుకు రూ.1639.18 ప్రకారం చెల్లిస్తామని టొరెంట్ పేర్కొంది. ఇందుకోసం రూ.6842.8 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఫార్మారంగంలో చోటుచేసుకున్న స్వాధీనతల్లో, ఇది రెండో అతిపెద్దదిగా పేర్కొంటున్నారు. 2015లో ర్యాన్‌బాక్సీ సంస్థను స్వాధీనం చేసుకునేందుకు సన్ ఫార్మా 4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ప్రస్తుత డాలర్ ధర ప్రకారం ఆ మొత్తం రూ.34,000 కోట్లు.
KKR – చరిత్రలోకి ఒక చూపు
జేబీ కెమికల్స్‌లో నియంత్రిత వాటాను స్వాధీనం చేసుకునేందుకు తమతో టొరెంట్ ఫార్మా తప్పనిసరిగా అమలయ్యే ఒప్పందం చేసుకుందని కేకేఆర్ (KKR) తెలిపింది. ఇందుకోసం సంస్థ ఈక్విటీ విలువను రూ.25,689 కోట్లుగా పరిగణించినట్లు పేర్కొంది. తదుపరి జేబీ కెమికల్స్, టొరెంట్ ఫార్మాలో విలీనం అవుతుంది.
షేరు మార్పిడి & ఓపెన్ ఆఫర్
జేబీ కెమికల్స్‌లో 100 షేర్లు ఉన్న వారికి, టొరెంట్ ఫార్మా షేర్లు 51 లభిస్తాయి. 1976లో స్థాపితమైన జేబీ కెమికల్స్‌లో 65% వాటాను కేకేఆర్ 2020లో కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చిలో 5.8% వాటాను రూ.1,460 కోట్లకు ఓపెన్ మార్కెట్ లావాదేవీల్లో విక్రయించింది. జేబీ కెమికల్స్ గ్యాస్ట్రోఎంటెరాలజీ, డెర్మటాలజీ, డయాబెటిస్ ఔషధాలను తయారు చేస్తోంది. అమెరికా (America)సహా 40 దేశాలకు ఫినిష్డ్ ఫార్ములేషన్లను ఎగుమతి చేస్తోంది. మెడికేటెడ్ లాసెంజెస్ తయారీలో అగ్రగామి సీడీఎంఓ సంస్థగా ఉంది.
అంతర్జాతీయ ఉనికి
రూ.45,000 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన టొరెంట్ గ్రూప్ ప్రధాన సంస్థ టొరెంట్ ఫార్మా. ఈ సంస్థ వార్షికాదాయం రూ.11,500 కోట్ల పైనే. కార్డియో వాస్క్యులర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్, కాస్మో డెర్మటాలజీ విభాగాల్లో థెరాప్యూటిక్స్ తయారీలోని అగ్రగామి 5 సంస్థల్లో ఇదీ ఒకటి. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సపైనే ఈ సంస్థకు 76% ఆదాయాలు వస్తున్నాయి. 50 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలున్నాయి.

టొరెంట్ ఫార్మా శక్తివంతమైన ప్రొఫైల్
టర్నోవర్: రూ.45,000 కోట్లు (టొరెంట్ గ్రూప్ మొత్తంగా)
టొరెంట్ ఫార్మా ఆదాయం: రూ.11,500 కోట్లు పైగా
ప్రధాన విభాగాలు: కార్డియో వాస్క్యులర్, గ్యాస్ట్రో, సీఎన్‌ఎస్, డెర్మటాలజీ
76% ఆదాయం దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సల నుంచి
50 దేశాల్లో వ్యాపారం.
Read Also: Anant Ambani: అనంత్ అంబానీ ఏడాది జీతం రూ.20 కోట్లు