లేఔట్లలో ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కులు, రహదారులు, ఇతర ఉమ్మడి స్థలాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) స్పష్టం చేశారు. బుద్ధవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన లేఔట్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖల నిపుణులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.
లేఔట్ మార్పులకు యజమానుల సమ్మతి తప్పనిసరి
లేఔట్‌లో ప్లాట్లకు కనీసం పది శాతం రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి అనే నిబంధనతోనే అధికారిక గుర్తింపు ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అనుమతి పొందిన లేఔట్ (Layout)లో మార్పులు చేయాలంటే, ఆయా ప్లాట్ల యజమానులందరి సమ్మతిని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి లేఔట్‌లో పది శాతం భూమిని పార్కులు, ఆటస్థలాలు, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
రెవెన్యూ రికార్డుల లోపాల వల్ల తలెత్తుతున్న సమస్యలు
వ్యవసాయ భూమిని లేఔట్‌గా మార్చిన తర్వాత ఆ సమాచారం రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో, తదుపరి తరం యజమానులు పాత పాసుపుస్తకాల ఆధారంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని నిపుణులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం, శేరిలింగంపల్లిలోని రాయదుర్గం చెరువు పరిరక్షణలో చొరవ చూపినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశాంతి హిల్స్ కాలనీ సభ్యులు సన్మానించారు.
Read Also : EPFO: ఈపీఎఫ్ వడ్డీలో మార్పు లేదు