నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, హ్యామ్ రహదారులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme)లో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా, అంచనాలకు మించి సుమారు పదహారున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో రూ.లక్ష వరకు కేటగిరీ లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించాలని భావించినప్పటికీ గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
గృహ నిర్మాణానికి
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సగటున 3,500 ఇల్లు మంజూరు చేయాలని ప్రణాళిక. ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మందికి మంజూరు పత్రాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గృహ నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, ఇటుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే లభించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇది లబ్ధిదారులకు భారీ ఊరట కలిగించనుంది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర బెనిఫిట్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉద్యోగ సంఘాల నుంచి ఈ విషయంలో కొద్ది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో, దీనిపై సానుకూలంగా స్పందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం.
సాగు ఏర్పాట్లపై
ఈ ఏడాది వానాకాలం సాగు ఏర్పాట్లపై కూడా మంత్రివర్గం సమీక్షించనుంది. యూరియా సరఫరాలో కేంద్రం తీరుతో సమస్యలు తలెత్తుతున్న వేళ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చర్చించనున్నారు. అదే విధంగా రైతు భరోసా పథకం అమలులో పారదర్శకత ఉండేలా మార్గదర్శకాలు సిద్ధం చేసే అవకాశం ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకు ఏం చేయాలనే అంశంపై దృష్టి పెడతారని సమాచారం. మేడిగడ్డ(Medigadda) ఏడో పిల్లర్ కుంగడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజినీర్లు, నీటి పారుదల అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై నీటి పారుదల శాఖ మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
Read Also: Urea: యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూపులు