తెలంగాణనికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు,రాష్ట్రంలో కొత్తగా ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను (JNV) నెలకొల్పేందుకు అధికారిక ఆమోదం తెలిపింది. 2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, తాజాగా పూర్తిస్థాయి ఆమోదంతో కూడిన ఉత్తర్వులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.ఈ పాఠశాలల్లో జూలై 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుతం తెలంగాణలో
ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయాను ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించి- ఏడు పాఠశాలలను రాష్ట్రానికి మంజూరు చేయించుకుంది.ప్రస్తుతం తెలంగాణలో కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో తొమ్మిది నవోదయ విద్యాలయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొత్తగా మంజూరైన ఏడు విద్యాలయాలతో కలిపి, రాష్ట్రంలో మొత్తం JNVల సంఖ్య 16కి చేరుకోనుంది. ఇది గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఒక పెద్ద ముందడుగు.
విద్యార్ధుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రతీ పాఠశాల రెసిడెన్షియల్ సౌకర్యంతో ఉంటుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్ధుల ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. కొత్తగా మంజూరైన ఏడు నవోదయ విద్యాలయాలపై విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా (Yogita Rana) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ టీ గోపాల్ కృష్ణ, నవోదయ విద్యాలయ సమితి రీజినల్ అసిస్టెంట్ కమిషనర్లు, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఇందులో పాల్గొన్నారు.
ప్రాధాన్యత
ఆయా పాఠశాల భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని యోగితా రాణా ఆదేశించారు. సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. విద్యా ప్రణాళికలను రూపొందించాలని, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయంతో తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులకు పూర్తిగా రెసిడెన్షియల్ విద్య (Residential education) ను అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.ఈ నూతన విద్యాలయాల ఏర్పాటుకు 2024 నుంచి 2029 మధ్య కాలంలో దాదాపు రూ.2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు కాగా నిర్వహణ ఖర్చులు రూ.415 కోట్లుగా లెక్కించారు. ఈ భారీ పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం విద్యా రంగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.
నవోదయ విద్యాలయాల విశిష్టత
జవహర్ నవోదయ విద్యాలయాలు తమ విశిష్టమైన విద్యావిధానానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి పూర్తిస్థాయి రెసిడెన్షియల్ (ఆశ్రమ) పాఠశాలలు. ఇక్కడ బాలబాలికలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తారు. అకడమిక్ పాఠ్యాంశాలతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన అనేక అంశాలపై దృష్టి సారిస్తారు. దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌సీసీ, చిత్రలేఖనం (ఆర్ట్ అండ్ క్రాఫ్ట్) వంటి అంశాలపై కూడా శిక్షణను అందిస్తారు. ఇది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
Read Also: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై టీజీ సర్కార్ కీలక నిర్ణయం