గచ్చిబౌలి జంక్షన్
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగించే ఒక శుభవార్త.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ (Shilpa Lays Out Phase 2 Flyover) ను ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి (PJR) పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కొండాపూర్ నుండి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు లైన్లతో విస్తరించి ఉంది. దీని నిర్మాణానికి సుమారు రూ. 178 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడో ఫ్లైఓవర్.ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్పా లే ఔట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉన్నాయి.
ట్రాఫిక్ కష్టాలు
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ వైపు వెళ్లే వాహనదారులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. గచ్చిబౌలి (Gachibowli) జంక్షన్ వద్ద ఏర్పడే రద్దీ, తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పెయింటింగ్, లైటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రయాణికులకు సౌలభ్యంగా
ప్రారంభోత్సవానికి ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP) లో భాగంగా నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్ ఐటీ ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.కాగా, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపడుతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య, నగరం విస్తరణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఒక సవాలుగా మారింది.
దీనిలో భాగమే
దీనిని అధిగమించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు సిద్దమైంది.స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP) కింద నగరంలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులు దీనిలో భాగమే. దీనివల్ల కీలక జంక్షన్లలో ట్రాఫిక్ (traffic) రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది.కొత్త రహదారులను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు.ప్రారంభం కానున్న ఈ సదుపాయం, హైదరాబాద్ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది.
Read Also: TGSRTC: ఇకపై టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వై-ఫై?