తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా అమలులోకి వచ్చింది. ప్రజల మౌలిక అవసరాల్లో ఒకటైన భూమి సంబంధిత సమస్యలు ఇప్పటివరకు ఎన్నో చికాకులకు కారణమయ్యాయి.
ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు, రైతులకు దగ్గరగానే సేవలు అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ భూ భారతి (Bhu Bharati) చట్టాన్ని రూపొందించి, మంగళవారం (జూన్ 13) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి. ఇందులో భాగంగా జూన్ 13 నుండి జూన్ 20 వరకు గ్రామాలకే రెవెన్యూ అధికారులు వెళ్లి భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రైతులు ఇక తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. “ఊరు దాటక్కర్లేదు.. కాలు కదపక్కర్లేదు.. రెవెన్యూ అధికారులే మీ గడప వద్దకు వస్తారు” అనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం గ్రామస్తుల్లో విశ్వాసం కలిగిస్తోంది. సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి రైతుల నుండి వారి భూ సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో భూ భారతితో సంబంధిత అవగాహన సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ధరణికి బదులుగా భూ భారతి – వ్యవస్థ మార్పుతో న్యాయం
(Dharani Portal) ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టాలు తదితర వ్యవహారాలు నిర్వహించబడుతున్నా, అనేక అంశాల్లో ప్రజలకు అవగాహన లోపం, సాంకేతిక లోపాలు, దుర్వినియోగం వంటివి కనిపించాయి. దీనికి ప్రత్యామ్నాయంగా భూ భారతి చట్టాన్ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటిగా నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయవంతమయ్యాక, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త చట్టం ప్రకారం, రైతులు వారి భూమి సమస్యలపై సంబంధిత ఫారాల ద్వారా అధికారులకు సమాచారం అందించవచ్చు. తర్వాతి దశలో సర్వేయర్లు అవసరమైన సర్వేలు నిర్వహించి, భూమి గీతలు ఖచ్చితంగా గుర్తించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని సర్వేయర్లకు ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆగస్టు 15 నాటికి అందరూ భూమి సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందేలా ఉచితంగా పరిష్కారాలు అందించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రైతులకు పిలుపు: భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోండి
రైతులు తమ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఇది ఓ అరుదైన అవకాశం.
“ప్రతి కుటుంబానికి భూ హక్కులను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భూ భారతితో భూ వివాదాలు తీరే మార్గం సులభం అవుతుంది,” అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అవగాహన సదస్సుల్లో పాల్గొనడం ద్వారా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయిలో భూ పరిపాలనలో పారదర్శకతను తీసుకురాగలదని, ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య నమ్మకాన్ని పెంచగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో భూ సమస్యలు తక్కువ సమయంలోనే పరిష్కారం పొందే అవకాశముంది. ఇది భవిష్యత్‌లో వ్యవసాయ అభివృద్ధికి పునాది వేసే కీలకమైన అడుగుగా నిలుస్తుంది.
Read also: Andhra: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు బార్సిల్ సంస్థకు అప్పగింత