తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులను తీసుకువచ్చింది. ఈ మార్పుల ప్రకారం.. కొత్త లోగోను TG పోలీస్ అధికారికంగా విడుదల చేసింది. పాత లోగోలో “తెలంగాణ స్టేట్ పోలీస్” అని ఉన్న చోట, ఇప్పుడు “తెలంగాణ పోలీస్” అని మాత్రమే ఉంచారు. ఈ మార్పు రాష్ట్ర గుర్తింపును మరింత స్పష్టంగా చేయడంలో భాగమని అధికారులు తెలిపారు.
గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పోలీస్ శాఖ పాత ఆనవాళ్లను కొనసాగిస్తూ స్టేట్ పదాన్ని చేర్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్త లోగో రూపొందించారు. ఈ లోగోలో స్టేట్ అనే పదాన్ని తీసివేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది తెలంగాణ ప్రత్యేకతను తెలియజేసేలా ఉండడం గమనార్హం.
ఈ మార్పుపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. తెలంగాణ పోలీస్ అధికారికతను మరియు ప్రత్యేకతను ఈ లోగో మరింత స్పష్టంగా తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖల పేర్లలోనూ మార్పులు చేపట్టారు. ముఖ్యంగా TS స్థానంలో TG అనే గుర్తింపును అమలు చేస్తున్నారు. లోగో మార్పు నిర్ణయంపై పలువురు ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాత లోగోతో ప్రజలు ముడిపడి ఉన్నారని, కొత్త లోగోకు అలవాటు పడటానికి సమయం పడుతుందని కొందరు అంటున్నారు. అయితే, కొత్త లోగో ద్వారా తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ లోగో మార్పు చిన్న విషయం అనిపించినప్పటికీ, దీనికి ఉన్న ప్రాధాన్యత అంతకంటే ఎక్కువ. ఇది కేవలం అధికారిక గుర్తింపుకే కాకుండా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో అడుగు అని చెప్పవచ్చు.