Telangana : గర్భగుడిలో రహస్య నిధుల కోసం దాడి తెలుగు రాష్ట్రాల్లో గుప్త నిధుల వేట మళ్లీ జోరందుకుంది ఏదైనా పురాతన ఆలయం కనిపిస్తే చాలు రహస్యంగా తవ్వకాలు మొదలవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ ఆలయాన్ని టార్గెట్ చేసిన సంఘటన కలకలం రేపింది. కంభాలపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రిల్లింగ్ మిషన్‌తో గర్భగుడికి రంధ్రాలు చేసేశారు.శనివారం రాత్రి ఆలయ అర్చకులు పూజలు ముగించాక గుడికి తాళం వేశారు. అర్చకుడు ఆదివారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి చూడగా గర్భగుడిలో కుదుర్లు కనిపించాయి. డ్రిల్లింగ్ మిషన్‌తో గోడకు రంధ్రాలు చేసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రత్యేక శక్తి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆలయంలో గతంలోనూ దొంగతనాలు జరిగాయట. కానీ ఈసారి నేరస్తులు నేరుగా గర్భగుడికే చేరుకోవడం భక్తులను కలవరపాటుకు గురిచేసింది.

ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని గ్రామస్థులు అంటున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయాలపై దాడులు చేయడం తీవ్ర పాపమని, గుప్త నిధుల కోసం ఇలాంటి పనులు చేయడం వలన దుష్ఫలితాలు తప్పవని వారిని హెచ్చరిస్తున్నారు.పురాతన ఆలయాలు, గుప్త నిధుల కథనాలు ఇప్పటికీ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ, వీటిని నమ్మి అక్రమ తవ్వకాలకు పాల్పడటం నేరమే కాదు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా తప్పేనన్నది భక్తుల వాదన. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు.