ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని వైఎస్ సునీతఇప్పటికే మీడియా సమావేశంలో చెప్పారు.ఈ కేసు దర్యాప్తు సీబీఐ నిర్వహిస్తోంది. ఈ కేసులో నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్లో లోపాలు జరిగాయని ఆరోపించారు వైఎస్ సునీత. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తూనే ఉంది.
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ
సునీత రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం 6:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆమె 35 నిమిషాలపాటు రాజ్‌భవన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారని, ఈ కేసులో న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, ఈ విషయంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని ఆమె కోరారు. తండ్రి మరణించి ఆరేళ్లయినా ఇప్పటి వరకు సిబిఐ కోర్టులో కేసు ట్రయల్‌కు రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్య వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందని, అందుకే ఈ కేసు ముందుకు సాగడం లేదని, కేసు విచారణ త్వరగా జరిగే విధంగా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. నిందితులందరూ బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మరణిస్తున్నారని, ఈ అంశంపై ఆందోళన చెందుతున్నట్లు గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది.

ఆందోళన వ్యక్తం
ఈ కేసులో ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు. నిందితుల్లో ఒకరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. సాక్షులు వరుసగా చనిపోతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందని అన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 14వ తేదీన రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో వివేకా ప్రచారం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఇంటికి వచ్చారు. మరుసటి రోజు తెల్లారేసరికి తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. వివేకా హత్యకు గురికాగా తొలుత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదే ఏడాది మే 30న జగన్ సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం కాకముందు సీబీఐ విచారణ అంటూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్ సీఎం అయిన తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో సునీత సీబీఐ విచారణను కోరారు.