Kalyana Kshetram Saipuram Temple: కల్యాణ క్షేత్రం సాయిపురం

Read Time:  1 min
Kalyana Kshetram Saipuram Temple
Kalyana Kshetram Saipuram Temple
FONT SIZE
GET APP

హిందూ సంప్రదాయం జీవ నదిలా ప్రవహించడానికి ప్రధాన కారణం దేవాలయాలు, నేటికి నిరాకారుడైన దేవదేవుని ప్రజలు పట్ల భక్తి విశ్వాసాలు హిందూ సంప్రదాయం, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండటానికి ముఖ్య కారణం దేవాలయాలే! కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ సంప్రదాయం చిన్న చిన్న పల్లెలు, గ్రామాల (villages) నుండి ఆరంభమై కొనసాగుతూవస్తోంది. అందుకే మన గ్రామాలలో ఇప్పటికి కూడా చక్కని పురాతన ఆలయాలు కనపడుతున్నాయి. అలాంటి ఒక చిన్న గ్రామం కృష్ణా జిల్లా లోని “సాయి (సాయ)పురం”

క్షేత్ర గాథ

ఈ సాయిపురం గతంలో “శ్రీ లక్ష్మి నరసింహ పురం” గా పిలవబడిన ఒక బ్రాహ్మణ అగ్రహారం శాసనాలలో ఆ పేరే కనపడుతుంది. వేద పాఠశాలలు, గురుకులాలకు నిలయం. ప్రతిరోజూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. గ్రామంలో రెండు పురాతన ఆలయాలు(Temples) నెలకొని ఉన్నాయి. శ్రీ రామేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.

Kalyana Kshetram Saipuram Temple
Kalyana Kshetram Saipuram Temple

ఈ రెండు ఆలయాలు ఏనాటి నుండి ఉన్నాయన్న దానికి స్పష్టమైన ఆధారాలు కనపడవు. తెలిసినంతవరకూ చాళుక్య రాజుల కాలంలో తొలి ఆలయాలు నిర్మించబడినట్లుగా చెబుతారు. అనంతరం అనేక రాజ వంశాల వారు గ్రామ ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా కైంకర్యాలు సమర్పించుకున్నారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న “నంది రాయి శిలాశాసనం” ప్రకారం ప్రస్తుత ఆలయాల నిర్మాణం విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న కొండపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన ఒడిషా గజపతుల కాలంలో జరిగినట్లుగా తెలియవస్తోంది. వారు శ్రీ జగన్నాథ భక్తులు, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు. ఎన్నో శ్రీ మహావిష్ణు ఆలయాలను నిర్మించారు. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం క్రీ.శ. 1585వ సంవత్సరం నవంబరు నెలలో కొండపల్లి నగర రాజాధిరాజు అనంత ప్రభువు, ఆయన సోదరి తిమ్మంబ వేయించారు.

నాలుగు పలకలుగా ఉంది. ఈ శాసనంలో ఒక పక్కన శ్రీ నరసింహ స్తోత్రం, రెండవ పక్క క్షేత్ర విశేషాలు, మూడవ పక్కన వారు బ్రాహ్మణులకు ఇచ్చిన భూ దానాల వివరాలు ఉంటాయి. నాలుగవ ఎక్కన ఆలయ, గ్రామ నిర్వహణలో దానగ్రహీతలు నిర్వహించవలసిన బాధ్యతల గురించి పేర్కొన్నారు.

నంది ధర్మానికి ప్రతీక. ఈ శాసనం పైన నందీశ్వర విగ్రహాన్ని చెక్కడం వలన దానం తీసుకొన్నవారు ధర్మంతప్పకుండా అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అన్న సందేశం, అర్థం కనపడతాయి. ఈ క్షేత్రం ఎంత విశిష్టమైనది, పురాతనమైనదన్న విషయం ఈ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్ద కాలంలో నూజివీడు జమిందారులు ఆలయ నిర్వహణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం కనపడుతున్న ముఖ మండపం నిర్మించబడినట్లు ఇక్కడ వున్న శాసనం ద్వారా తెలుస్తోంది. వీరు కూడా శ్రీ వైష్ణవాన్ని అనుసరించేవారు. అనేక ఆలయాలను పునరుద్ధరించారు. నూతన దేవాలయాల నిర్మాణం చేశారు. ఆగిరిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వ్యాఘ్ర నరసింహ ఆలయాన్ని పునః నిర్మించినది వీరి కాలంలోనే.

ఆలయ విశేషాలు

తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయానికి అంతస్థుల రాజగోపురం నూతనంగా నిర్మించారు. గోపురానికి ఇరుపక్కలా శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఈశాన్యంలో శ్రీవారి కల్యాణ మండపం కనిపిస్తుంది. కృష్ణాతీరంలోని అనేక ఆలయాలలో ఈశాన్య దిశలో మండపాన్ని నిర్మించడం ఒక సంప్రదాయంగా కనిపిస్తుంది. మండప సమీపంలోనే నంది రాయి శిలాశాసనం కనపడుతుంది. ఎత్తైన ధ్వజస్థంభం వద్ద ఉన్న సన్నిధిలో వినతానుతుడు నిత్యసూరి అయిన శ్రీ గరుత్మంతుడు శ్రీవారి సేవకు సదా సిద్ధం అన్నట్లుగా ముకుళిత హస్తాలతో వినమ్రంగా కొలువై ఉంటారు.

ప్రదక్షిణా పథంలో మిగిలిన ఆలయాలకు భిన్నంగా గర్భాలయ వెలుపలి భాగంలో కొన్ని మూర్తులు ఉంచారు. సహజంగా విష్ణు ఆలయాలలో శ్రీ మహావిష్ణువు, శ్రీ గదాధరుడు, శ్రీ నరసింహ, శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ విష్ణు గణపతి కనపడతారు. కానీ ఇక్కడ దక్షిణం వైపున దేవఋషులు శ్రీహరి గాయక భక్తులైన శ్రీ నారద తుంబుర విగ్రహాలు ఉంటాయి. లోకకంటకుడైన హిరణ్య కశిపుడు మరణించిన సందర్భంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. యక్షులు, కిన్నెరలు, గంధర్వులు ఆనందంతో ఆది పాడారు. శ్రీ నరసింహుని కీర్తించారు. దానిని దృష్టిలో పెట్టుకొని శ్రీ నారద తుంబురాలను ఉంచారేమో అనిపిస్తుంది.

గర్భాలయ వెనుక భాగంలో నమస్కార భంగిమలో బాలుడైన ప్రహ్లాదుడు కనపడతాడు. శ్రీ స్వామివారు ప్రహ్లాద వరద నారసింహుడు కదా! ఉత్తరం వైపున శ్రీమన్నారాయణుని అవతారం, ఆది వైద్యుడు అయిన శ్రీ ధన్వంతరి స్వామి, శ్రీ దాసాంజనేయ స్వామి మూర్తులు కనిపిస్తాయి. శ్రీ నరసింహుడు భక్తుల అపమృత్యు భయాన్ని, అనారోగ్య వ్యాధులను హరించేవాడిగా ప్రసిద్ధి. శ్రీ ఆంజనేయుడు భూతప్రేత పిశాచ పీడలను హరించేవాడు. అపర శ్రీరామ భక్తుడు. భక్తివిశ్వాసాలతో స్వామిని శరణు కోరితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయిన తొలగిపోతాయి అన్న ఉద్దేశంతో రూపాలను ఉంచారేమో! కానీ ఇలాంటి మూర్తులు మరే ఇతర ఆలయంలోనూ కనిపించవు.

ఆలయ విమాన గోపురం నలుదిక్కులా శ్రీ లక్ష్మి నారాయణునితో పాటు శ్రీహరి లోక సంరక్షణార్థం ధరించిన దశావతార సుందర రూపాలతో అలంకరించారు. ముఖమండపంలోనే ప్రాంగణంలో ఉన్న ఏకైక ఉపాలయం కనపడుతుంది. వైష్ణవ ఆలయాలలో శ్రీ ఆంజనేయుని సన్నిధి తప్పనిసరి. మరీ ముఖ్యంగా శ్రీ నరసింహ ఆలయాలలో వాయునందనునికి సముచిత స్థానం కనపడుతుంది. దక్షిణాముఖంగా ఉన్న ఈ సన్నిధిలోఅంజనానుతుడు, రామదూత శ్రీ దాసాంజనేయుడు నమస్కార భంగిమలో దర్శనమిస్తారు. దక్షిణాముఖ హనుమంతుడు అపమృత్యు భయాన్ని, భూత ప్రేత పీడలను, గ్రహ దోషాలను నివారించేవానిగా ప్రసిద్ది. ముఖ మండపానికి అనుసంధానంగా ఉండే చిన్న అర్ధ మండపంలో శ్రీ రాజ్యలక్ష్మి ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. ఇవన్నీ అనంతర ప్రతిష్ఠులు. గర్భాలయంలో ఎత్తైన పీఠం మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిస్తారు.

Kalyana Kshetram Saipuram Temple
Kalyana Kshetram Saipuram Temple

శ్రీమూర్తి విశేషాలు

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యుగాల క్రితం ఇక్కడ స్వయం వ్యక్తిగా వెలిశారని చెబుతారు. మూలవిరాట్టు ఎత్తైన పీఠం మీద వామాంకంపైన శ్రీ లక్ష్మీ తాయారును కూర్చోబెట్టుకొని ప్రసన్న వదనంతో దర్శనం అనుగ్రహిస్తారు. మిగిలిన శ్రీ నరసింహ ఆలయాలలోని మూర్తికి ఈ మూర్తికి కొన్ని వ్యత్యాసాలు కనపడతాయి. ఇతర నరసింహ మూర్తుల మాదిరి విరాట్ రూపంలో ఉండరిక్కడ. స్వామి చిన్న విగ్రహ రూపంలో రమ్యమైన అలంకరణలో మీసాలతో గంభీరంగా కనపడతారు. సహజంగా మిగిలిన ఆలయాలలో వామాంకం మీద ఉపస్థితురాలైన తాయారు రూపం చిన్నదిగా కనిపిస్తుంది. సాయిపురంలో అమ్మవారు స్వామి వారికి సమానమైన ఎత్తులో ఉంటారు. శ్రీ కల్యాణ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ నుదిటి పైన చిన్న శివలింగం ఉండటం మరే ఆలయంలో కనపడని విశేషం.

సాయిపురం ఒక పరిహార క్షేత్రం. ముఖ్యంగా కల్యాణ క్షేత్రంగా అభివర్ణిస్తారు. స్వామివారిని కల్యాణమూర్తి అని పిలుస్తారు. జాతక లేదా గ్రహ ప్రభావంతో వివాహం కాని యువతీ యువకులు ఎవరైనా నెలలో ఏ రోజు అయినా శ్రీ స్వామి వారి కళ్యాణం జరిపిస్తే మండలం లోపల అనుకూలమైన వ్యక్తితో వివాహం తప్పనిసరిగా జరుగుతుంది అని చెబుతారు.

ఉత్సవాలు

నిత్యం నిర్ణయించిన పూజలను శాస్త్ర ప్రకారం జరుపుతారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ నరసింహ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి రోజులలో పెద్ద సంఖ్యలో భక్తులు జిల్లా నలుమూలల నుండి తరలి వస్తారు. ధనుర్మాస పూజలు, తిరుప్పావై గానం, భోగి రోజున శ్రీ గోదా కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర మాసంలో ఆలయ ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bonalu-telangana-2025-a-festival-of-amma-with-a-heart-full-of-love/sunday-magazine/514681/

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.