వేసవి కాలం వచ్చిందంటే మండే ఎండలు, తీవ్ర గాలులు మనల్ని కష్టానికి గురి చేస్తాయి. ఉదయం పది గంటల నుంచే భానుడి ప్రతాపానికి నేల మాడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరాన్ని చల్లబరచుకోవడానికి చాలా మంది రసాయనాలతో నిండిన కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే అవి తాత్కాలిక ఉల్లాసాన్ని మాత్రమే కలిగిస్తాయి కానీ, ఆరోగ్యపరంగా ప్రమాదకరమవుతాయి. అందువల్ల సహజంగా లభించే ఆరోగ్యకరమైన శీతల పానీయాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పానీయాలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కలిగినవి. మరి వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచే కొన్ని ముఖ్యమైన పానీయాల గురించి తెలుసుకుందాం.

నారింజ – అల్లం జ్యూస్
నారింజలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి ప్రకాశవంతంగా మారుస్తుంది. నారింజ రసం తరచూ తాగడం వల్ల శరీరానికి నూతన శక్తిని అందిస్తుంది. అల్లంలో ఉండే శోథ నిరోధక గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలా తయారు చేయాలి? ఒక నారింజను జ్యూసర్‌లో పిండి రసం తీసుకోవాలి. చిన్న ముక్క అల్లం గ్రేటర్‌తో తురిమి జ్యూస్‌లో కలపాలి. తేనె లేదా స్టీవియా చేర్చి సేవించాలి.
పుచ్చకాయ – పుదీనా జ్యూస్
పుచ్చకాయ వేసవిలో అత్యంత ఉపయోగకరమైన పండు. ఇది 90% నీటి శాతం కలిగి ఉండటంతో శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది. ఇందులో విటమిన్లు A, C మరియు లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమతో నింపి సూర్యుని ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎలా తయారు చేయాలి? కొంత పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. కొత్తిమీర లేదా పుదీనా ఆకులను కలిపి మళ్లీ బ్లెండ్ చేయాలి. ఒక గ్లాస్‌లో వడకట్టి, ఐస్ క్యూబ్స్ వేసి తాగాలి.
పైనాపిల్ – అల్లం జ్యూస్
పైనాపిల్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫలాలలో ఒకటి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ పండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంలోని మంటలు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఎలా తయారు చేయాలి? రెండు ముక్కలు పైనాపిల్‌ను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఒక చిన్న ముక్క అల్లం వేసి కలిపి మళ్లీ బ్లెండ్ చేయాలి. చల్లబరిచిన నీరు కలిపి తాగాలి.
నిమ్మ – పుదీనా జ్యూస్
నిమ్మకాయలో అధిక మోతాదులో విటమిన్ C ఉండటంతో శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. నిమ్మరసం తరచుగా తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పుదీనాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎలా తయారు చేయాలి? ఒక నిమ్మను గుజ్జుతో కలిపి రసం తీసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు మెత్తగా నలిపి కలపాలి. నీటిని కలిపి, తేనె లేదా చక్కెర వేసి తాగాలి.
బెల్లం – పంచదారపానకం
పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ పానీయం వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంలో ఉండే ఖనిజాలు శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. ఎలా తయారు చేయాలి? బెల్లం, పంచదార తగినంత మోతాదులో నీటిలో కరిగించాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ కలిపి తాగాలి.
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు సహజంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే ఉత్తమమైన పానీయం. ఇందులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటంతో ఒంట్లో వేడి తగ్గుతుంది. ఇది తేనెలో రసం కలిపి తాగితే మరింత శక్తినిస్తుంది. తాజా కొబ్బరి నీటిని నేరుగా తాగాలి. కొత్తిమీర లేదా పుదీనా ఆకులు వేసి మరింత రుచిగా తాగొచ్చు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి, సహజమైన, ఆరోగ్యకరమైన శీతల పానీయాలను తాగడం అలవాటు చేసుకోవాలి. పై చెప్పిన జ్యూసులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వేసవి వేడిని తట్టుకునేందుకు సహాయపడతాయి. మార్కెట్లో లభించే రసాయనాలతో నిండిన కూల్ డ్రింక్స్‌కు బదులుగా, ఇంట్లోనే తాయారు చేసుకునే ఈ సహజ పానీయాలను ఎంచుకుని ఆరోగ్యంగా ఉండండి.