AP Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజులు పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ తో పాటు పలు బిల్లులపై వాడీవేడీగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీరణ బిల్లును ప్రవేశ పెట్టారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. 2025-26 అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు ఏడాదిపాటు పనిచేయనున్నాయి. అసెంబ్లీ రూల్స్ కమిటీ ఛైర్మన్‌గా అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్‌గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ ఛైర్మ్‌గా మండలి బుద్ధ ప్రసాద్, ప్రివిలేజెస్ కమిటీ ఛైర్మన్‌గా పితాని సత్యనారాయణ, పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా రఘురామకృష్ణంరాజు మితులయ్యారు. అనంతరం ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు.