విద్యార్థులపై ఇమిగ్రేషన్ కఠిన చర్యలు
అమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లని వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మసాచుసెట్స్‌లో చోటుచేసుకున్న తాజా ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విదేశీ విద్యార్థినిని మంగళవారం రాత్రి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మూడు కార్లలో ప్రత్యేక బృందంగా వచ్చిన అధికారులు, ఆమె నివాసమైన ఆఫ్-క్యాంపస్ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని ఈ అరెస్టు చేపట్టారు.

బేడీలు వేసి కారులో తీసుకెళ్లిన పోలీసులు
భుజాన బ్యాగుతో వెళుతున్న విద్యార్థినిని అధికారులు చుట్టుముట్టి, ఆమె చేతులు వెనక్కి విరిచి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే, ఆ విద్యార్థిని వీసా రద్దు అయినట్లు సమాచారం. యూనివర్సిటీ అధికారుల ప్రకటన ప్రకారం, ఈ అరెస్టు విద్యార్థులలో భయాందోళనలకు కారణమైంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ వీడియో
స్టూడెంట్ అరెస్టును సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇప్పటి వరకు హోంల్యాండ్ సెక్యూరిటీ లేదా విద్యార్థిని తరఫున న్యాయవాది ఈ ఘటనపై అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటనపై విద్యార్థులు, వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఈ ఘటనను ఖండిస్తూ నిరసనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.