ఐపీఎల్ 2025 సీజన్‌లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో లక్నో పేసర్ అవేశ్‌ఖాన్ అద్భుతం చేశాడు. హెట్‌మైర్(12)ను ఔట్ చేసిన అవేశ్ 6 పరుగులే ఇచ్చుకుని లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 178/5 కు పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఫామ్‌ను కొనసాగించగా కెప్టెన్ రియాన్ పరాగ్ (39) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 14 ఏండ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. మార్క్మ్ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అయుశ్ బదోని (34 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
బదోని
జోరు మీదున్న మిచెల్ మార్ష్ (4)ను మూడో ఓవర్లోనే ఆర్చర్ పెవిలియన్‌కు పంపి రాయల్స్‌కు తొలి బ్రేక్‌నిచ్చాడు. ఆరెంజ్ క్యాప్ వీరుడు నికోలస్ పూరన్ (11)ను సందీప్ శర్మ వికెట్ల ముందు బలిగొనగా కెప్టెన్ పంత్ (3) వైఫల్య ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగింది. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోను మార్క్మ్,బదోని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించారు. 31 బంతుల్లో మార్క్మ్ అర్ధశతకాన్ని పూర్తిచేశాక బ్యాట్ ఝుళిపించాడు. మరో ఎండ్‌లో బదోని కూడా వేగంగా ఆడాడు. అయితే ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్, 4 సిక్సర్లు) మెరుపులతో లక్నో పోరాడగలిగే స్కోరును సాధించింది.

మిచెల్ స్టార్క్
ఈ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన ఆవేశ్ ఖాన్ మిచెల్ స్టార్క్‌తో తాను అస్సలు పోల్చుకోలేదని తెలిపాడు. సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్ స్టన్నింగ్ డెలివరీతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాడు. తాజా మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ కూడా అతనిలానే యార్కర్లు సంధించి మ్యాచ్ గెలిపించడంతో హోస్ట్ మిచెల్ స్టార్క్ ప్రస్తావన తీసుకొచ్చాడు.’నేను మిచెల్ స్టార్క్ అవ్వాలని అనుకోలేదు. ఓ మంచి ఆవేశ్ ఖాన్‌లా మాత్రమే ఉండాలనుకున్నా. ప్రతీ బంతిని కట్టుదిట్టంగా వేయాలనుకున్నా.నేను బంతిని వేయడానికి అదనంగా సమయం తీసుకోవడం కలిసొచ్చింది. మెరుగైన బౌలింగ్ చేసేందుకు ఈ సమయం ఉపయోగపడింది. నేను స్కోర్ బోర్డ్ చూసి బౌలింగ్ చేయను. ఎలాంటి బంతి వేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెడుతాను. 9 పరుగులు డిఫెండ్ చేయాల్సినప్పుడు తొలి మూడు బంతుల్లో బౌండరీ ఇవ్వకూడదని భావించా. అలా చేస్తే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలుసు. అప్పుడు మ్యాచ్ గెలవచ్చని భావించా. నేను అన్నుకన్నట్లే జరిగింది.’అని ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.