కొత్త ఏడాది ప్రారంభంలోనే ఖగోళ ప్రియులకు ఆసక్తికరమైన సంఘటన జరగబోతోంది. 2025లో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం ఖగోళ శాస్త్రంలో విశేష ప్రాధాన్యం కలిగి ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు ఆసక్తి చూపిస్తున్నారు.

సంపూర్ణ సూర్యగ్రహణమా, పాక్షికమా?
ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ, భూమిపైని అనేక ప్రదేశాల్లో పాక్షిక సూర్యగ్రహణంగా మాత్రమే కనిపిస్తుంది. అంటే, చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పివేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణ సమయంలో సూర్యుడి ఆకృతి చెదిరినట్లు కనిపించనుంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించవచ్చు. భారతదేశంలో ఈ గ్రహణాన్ని చూడలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే, నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, గ్రీన్‌లాండ్, ఐర్లాండ్ వాసులకు ఈ గ్రహణం పాక్షికంగా కనిపించనుంది. పశ్చిమ యూరప్- మధ్యాహ్న సమయంలో గ్రహణం కనిపిస్తుంది. ఉత్తర – పశ్చిమ ఆఫ్రికా- ఉదయం వేళ గ్రహణం స్పష్టంగా గమనించవచ్చు. తూర్పు యూరప్ -సాయంత్రం సమయంలో గ్రహణం కనిపించనుంది.
గ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సాధారణంగా, సూర్యగ్రహణం చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. చంద్రుడు తన కక్ష్యలో ప్రయాణిస్తూ పూర్తిగా లేదా కొంతవరకు సూర్యుడిని కప్పివేస్తుంది. మార్చి 29న చంద్రుడు భూమి, సూర్యుడి మధ్య ప్రయాణించడంతో ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే, గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ, భూమిపైకి వచ్చే కోణాన్ని బట్టి పాక్షికంగానే కనిపిస్తుంది. నాసా శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, గ్రహణం ఏర్పడే సమయంలో చంద్రుడి నీడ భారతదేశాన్ని తాకదు. పాక్షిక గ్రహణం ఏర్పడే ప్రాంతాలు భౌగోళికంగా భారతదేశం కంటే మరింత పశ్చిమ దిశలో ఉండటంతో, భారతీయులకు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడం కళ్లకు హానికరం. కాబట్టి, దాన్ని కార్డిబోర్డు సిల్వర్ ఫిల్టర్ గ్లాసెస్, మైలార్ షీట్లు లేదా టెలిస్కోప్ ఫిల్టర్ల సహాయంతో మాత్రమే చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాధారణ కళ్లద్దాలు, సన్‌గ్లాసెస్, సీడీ డిస్క్, వాటర్ మిర్రర్ లాంటి వాటితో గ్రహణాన్ని చూడటం ప్రమాదకరం. భారతీయ జ్యోతిష్యంలో సూర్యగ్రహణాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే, ఈ సారి భారతదేశంలో గ్రహణం కనిపించకపోవడం వల్ల గ్రహణసూతకం పాటించాల్సిన అవసరం లేదు. సాధారణంగా సూర్యగ్రహణం సమయంలో దాన ధర్మాలు, జపం, పుణ్యస్నానం, గాయత్రీ మంత్ర పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మార్చి 29న జరగబోయే ఈ సూర్యగ్రహణం ఖగోళ విశ్వాసులకు ఒక విశేషమైన సంఘటన. భారతదేశానికి ఈ గ్రహణం ప్రభావం లేకపోయినా, ఇతర దేశాల్లో సూర్యగ్రహణాన్ని గమనించేందుకు ఆసక్తి కలిగిన వారు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.