ప్రముఖ గాయని కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు ఆమె కూతురుతో జరిగిన మనస్పర్థలే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కూతురితో గొడవ
కల్పన పెద్ద కూతురు కేరళలో నివసిస్తోంది. మంగళవారం కూతురిని ఫోన్ ద్వారా హైదరాబాద్‌కు రావాలని కోరారు. కానీ కూతురు కేరళలోనే ఉంటానని, రావలేనని చెప్పడంతో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సంఘటనతో కల్పన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నం ఎలా జరిగింది?
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగారు. సాయంత్రం 4:30 గంటలకు భర్త ప్రసాద్ చెన్నై నుండి ఫోన్ చేశారు. కల్పన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పలుమార్లు ప్రయత్నించినా సమాధానం రాలేదు.
విల్లా సెక్రటరికి సమాచారం ఇచ్చిన భర్త, అతడు తలుపు తట్టినా కల్పన తెరవలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. అపస్మారక స్థితిలో పడివున్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఇప్పుడు నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూతురితో వాగ్వాదం జరిగినట్లు స్పష్టమైంది. అయితే, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా తీసుకుంటున్నారు. ఇతర వ్యక్తులు, కుటుంబ సమస్యలు కూడా కారణంగా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కల్పన భర్త ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కూతురితో సంబంధిత గొడవే ప్రధాన కారణమా? లేక ఇతర కుటుంబ సమస్యలూ కారణమా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.