ఐపీఎల్‌లో నిన్న జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసినా, చివరకు పరాజయాన్ని ఎదుర్కొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 245 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, పంజాబ్ జట్టు 18.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ చేదు రికార్డును నమోదు చేసుకున్నారు.
శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 200కి పైగా స్కోరు చేసి, మ్యాచ్‌ను డిఫెండ్ చేయలేక మూడు సార్లు ఓడిన కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే కోవలో ఫాఫ్ డుప్లెసిస్, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, విరాట్ కోహ్లి లాంటి కెప్టెన్లు రెండుసార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే, మూడు సార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్న వారు అయ్యర్, ధోనీ మాత్రమే.

బౌలింగ్ విఫలం
పంజాబ్ బలమైన బ్యాటింగ్‌తో మంచి స్కోరు చేసినా, బౌలింగ్ విఫలమవడంతో మ్యాచ్ చేతులెళ్లిపోయింది. హైదరాబాద్ ఆటగాళ్లు అదిరిపోయే బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలోనే 245 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతమయ్యారు. ఈ మ్యాచ్ తర్వాత, అయ్యర్ కెప్టెన్సీలో తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.